Tuesday 23 September 2008

ఆకుపచ్చని తడిగీతం

ప్రకృతి మాత ఒడిలో కూర్చుని తదేకంగా ఆ తల్లి చేసే వింతలు, విడ్డూరాలు చూపే బాలుడిలా......ప్రకృతి కన్యను చాటు నుంచి చూసి ఆమె చూపే హోయలు, అందాలకు పరవశించే రసికుడిలా..... ఎన్ని కోణాలలో చూడుచ్చో ఈ ప్రకృతిని. అలా అన్ని కోణాలు చూపించే ఈ అద్భుతమైన వర్ణన చూడండి. బాబా గారి కలం నుంచి జాలు వారిన ఇంకో ఆణి ముత్యం ఈ ఆకుపచ్చని తడిగీతం
మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి.
తెల్లవార్లూ వాన కురుస్తానే ఉంది.

నల్లని మంచుగడ్డ కరిగిపోయింది.

ప్రశాంత తరువుల్లోకి ప్రాత:కాలం
తడితడిగా ప్రవేశించింది.
వందగుమ్మాలతో వెదురు పొద
స్వాగతం పలికింది.

సూర్యకిరణాల కిలకిలారావానికి
లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగు మారింది.

తీగమొక్కలు జారిపోయిన పట్టును
మళ్లా వెతుక్కొంటున్నాయి.

తడినేలపై పడి పరావర్తనం చెందిన
లేకిరణాలు, ఆకుల క్రింద దాక్కొన్న
చీకటిని తరిమేస్తున్నాయి.

చెట్ల ధూళి వాన గుంటలలో చేరి
ఆకుల అందాలను చూస్తూ విస్తుపోతోంది.

మబ్బు అంచుల జరీ మెరుపులతో
పోటీ పడే ఈకల కోసమై
ఓ పక్షి శ్రద్ధగా ప్రీనింగ్ చేసుకొంటూంది.

తలంటుకొన్న యవ్వనిలా శోభిస్తున్న
పొగడ చెట్టు గాలికిరణాలలో
పత్రాలను ఆరబెట్టుకొంటూంది.

ఉదయపు గొంతులోంచి
ఆకుపచ్చని తడిగీతం
రెక్కలుకట్టి ఎగురుతూంది.
మేఘాలవతల వరకూ
సౌందర్యం పరచుకొంది.

తటాకం అంతవరకూ భద్రంగా
దాచుకొన్న తామరదుంపకు
కొత్తచిగుళ్లు లేస్తున్నాయి
నేల ఆలపించే ప్రాచీన గీతాన్ని చిత్రించటానికై.

తడిచిన సీతాకోకచిలుక
కవిత్వంపై వాలి రెక్కలల్లార్చింది.

http://sahitheeyanam.blogspot.com/