ఏడకి పోతాండ్రు??
నమస్తే అన్నా!! ఎట్లున్నారే?? అంతా బాగేనా?? ఇన్ని దినముల సంది గా మూలన పడున్నా.. గివలా ఎందుకో ఊరు మీదకు పొవాలే అని తెచ్చిండ్రు. పొద్దుగాల నుండి ఒక్కటే చక్కర్లు. ఇక ఇంటికి పొతాంటే మీరు కానొచ్చినారు.. మాట మాట కలుపుకుంటూ పోదాము రాండ్రి.అసలు పొద్దుగాల రోడ్డు మీదకు రాగానే మస్తు పరెశాను అయ్యినా.. ఏడికాడికి గిట్లా తవ్విపెట్టినారు ఏమని? నడవలేక నడవలేక నడిచినా!! ఏమో మెగా సిటీ అంటున్నారు కదా, జుమ్మున పొదాం అనుకున్నా.. నత్త మల్లే నడిచి వచ్చినా.. తోవంతా తవ్వింది.. గాడ ఆ ఎక్స్ ప్రెస్స్ వే కడుతున్నారట గా!! రాను రాను ఊరంతా మారిపోయినట్టు కానచ్చే.. గా మెహదిపట్నం - సరోజిని దవాఖాన కాడ చిన్న చిన్న ఇల్లు ఉండే.. ఇప్పుడన్నీ మిద్దలే!! ఆడే కాదు.. మొత్తం అట్లనే ఉంది. ఆ పంజగుట్ట ట్రాఫిక్ లో గంట ఇరుకున్నా.. కదలలేము, నిలవలేము, హార్న్ లు కొడతానే ఉంటిరి.. కాలు పెట్టనీకి సందు లేదాడ.. గీ బైకుల మీద పొరగాళ్ళు పొతానే ఉన్నరు.. ఒక్కడు నన్ను డొక్కలో పొడిచిండు. నేనయితే నోరు మూసుకున్నా.. ముందర ఎవడో లొల్లి చెసినాడు. ఓ యమ్మా.. నరకమంటే గింతే అనుకున్నా. ఎట్లొ హైటెక్ సిటీ కాడకు పొయినా నిక్కుతూ నీల్గుతూ.. ఏం జబర్దస్తుగుంది ఆ మిద్దే.. నాకైతే దిమ్మతిరిగిందనుకో రాదు.. బానే నేర్వబట్టిరి అనుకున్నా.. ఆ రాస్తాలో గన్నీ గట్లానే ఉన్నయ్.. నా షెహరేనా అనిపించింది. మేగా సిటీ నుండి గ్రేటరు సిటీ గా మారుతున్నారటగా??అటు నుండి... కోఠీకి పోవాల్సి వచ్చె!! అగుతూ నడుస్తూ వెళ్లింటిమి. సుల్తాన్ బజార్లో తిరుగాతా ఉంటే .. అమ్మా.. ఇది నా షహరే అని నమ్మకం కుదిరింది. గవె గల్లీలు, గవె దుక్కణాలు. అప్పట్లో ఉన్నట్టు జనం లేరు గాని, సందడిగా మాత్రం ఉందనట్టు. ఈ కొత్త పోరగాళ్లంతా గవివో "సెంట్రల్లు" అంటూ తిరుగుతాండ్రట గా.. నా చెవిన పడ్డది. అటె ఉన్న ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ కి ఎల్లగానే పాణం సమ్మగయ్యింది. ఏన్నెన్ని సినెమాలు ఈడ..అన్నీ యాదికి వస్తూనే ఉన్నయ్. కనీ ఇదేంది ఇంత ఉక్కగా ఉంది. గాలే లేకపాయే!! సరె.. అని అటు నుండి... మల్లా మెహిదిపట్నం వచ్చినా.. అప్పటికే ఓళ్ళు ఊహనమయ్యిందా.. గైనా ఈ పొరగాడు.. ఒకటే గోల చెవిలో .. పీక కొసిన వేట లెక్క ఒక్కటే కేకలు. అప్పు ఇచ్చినోడు కాడ కూడ అట్లా గదమాయించడేమో... దబాయించి మరీ కుర్సోబెడుతున్నాడు. ఇప్పుడె ఆ పోలీసు వచ్చి నన్ను దబా దబా బాదిన్నాడు. ముసల్దానని సూడకుండా.. అయ్యినా ఈడు మళ్ళా షురువయ్యిండు. ఇప్పుడు కనీశం ఎనిమిది-పది మంది ఎన్నడు ఎక్కుతారో.. నేను ఎప్పుడు కదులుతానో మల్లగుల్లలు పడతాంటే మీరు వచ్చిండ్రు.ఇది నేను పుట్టి పెరిగిన ఊరేనా?? ఈళ్ళంతా నా మనుషులేనా అని ఓ అనుమానం వచ్చి పడ్డాది. నాకు తెల్వదా ఈ మనుషుల గురించి అనుకున్నా గాని సానానే మారిపొయిండ్రు మీరంతా.. ఈ ఉరుకులేంది?? ఈ పరుగులేంది?? ఒక్కడైనా నిదానంగా ఉంటడా అంటే.. ఎవడూ కానరాకపోయె. ఈ రోడ్లు, మిద్దెలు, సిటీలు, సెంట్రల్లు అన్నీ బానే ఉన్నై.. రేపు మా ఆటో లన్నీ మూల పడేసి ఆ కాబుల్లోనే తిరిగుతారేమో!! బానే అనిపిస్తాంది.. .కానీ మీరెమి గిలా దేనికీ కాకుండా పోతాండ్రు. పైసలు కట్టీ, ఎందుకలా మా ముందు సీట్లలో ఏలాడుతున్నారు? ఆడకూతుర్లను నడిమిట్ల దించేస్తారా.. పక్కకు జరగము అంటే. జర్రంత ఓపిక పట్టలేరు.. ట్రాఫిక్ లో!! అసలు "ఆప్ జావో .. ఆప్ జావో" అని లేట్ లతీఫ్ లు గా పిలిచేటోరు గదా మిమల్ని.. మీరేనా గిట్ల కాళ్ళు గాలిని పిల్లి లెక్క సెక్కర్లు కొడతాండ్రు?? ఎమయ్యింది మీకు?? ఎటు పోతాండ్రు మీరు?? ఎరుకేనా??****************************************************************************************************************The city of laidbackness నుండి The restless city గా మనం ఎదుగుతున్న(??) వైనం అగమ్యగోచరంగా ఉంది. సిటి విస్తరిస్తూనే ఉంది, మనమే ఇరుక్కుగా మారిపోతున్నాము. వాతావరణమే కాదు.. మన మనసులు అలాగే ఉన్నాయి. హైదరాబాదుతో అనుబంధం ఉన్నవాళ్ళే కాదు.. ఏ కొంచం తెలిసిన వాళ్ళూ కూడా "ఏంటిది??" అని ప్రశ్నించేలా చేసుకుంటున్నాము. ఆటో అన్నట్టు .. మన గమ్యం ఎటో ఎమీ తెలియదు.. కనీసం దారినైనా ఆశ్వాదిద్దామా??
http://oohalanni-oosulai.blogspot.com/2008/04/blog-post.html
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment