రాత్రి కురిసిన వర్షం
అర్ధరాత్రి చెంపలపై ఆత్మీయపు తడి తగిలి లేస్తే
కిటికీ అవతల వర్షం కురుస్తోంది
తెల్లని పువ్వయి విచ్చుకున్న ఆకాశపు హృదయం నుండీ
సౌహార్ద్రం జాల్వారినట్లు వాన
జననాంతర సౌహృదాలేవో జలజలా మేల్కొలుపుతుంది
అర్ధరాత్రి కిటికీ లోంచీ వర్షాన్ని చూస్తుంటే
తెలియని రసప్రపంచపు రహస్య ద్వారమేదో తెరచుకున్నట్లుంటుంది
నీలిరంగు చీకటిలో నీడలు కదలాడినట్లు
మార్మిక ఛాయలేవో మనసును కలవరపెడతాయి
తడిసిన మట్టి వాసనతో గాలి శరీరాన్ని చుడితే
సాంద్రమూ సన్నిహితమూ అయిన స్వప్నమేదో స్పర్శించినట్లుంటుంది
సగం తెరిచిన కిటికీ రెక్కపై చిత్రమైన సంగీతాన్ని ధ్వనించే చినుకులు
నిద్రకూ మెలకువకూ మధ్య నిలిచి
నిర్ణిద్ర గానాన్ని వినిపిస్తున్నట్లుంటుంది
మంద్రస్థాయిలో వినిపించే జంత్రవాయిద్యపు సంగీతవిభావరిలో
తన్మయమై పోయిన మనస్సు
తెలియకుండానే పొలిమేర దాటి నిద్రలో జోగుతుంది
తెరలు తెరలుగా దృశ్యం అదృశ్యంలోకి మాయమయినట్లుగా
తెల్లారి లేచి చూస్తే_
అప్పుడే తలంటు పోసుకుని కురులారబెట్టుకుంటున్న జవ్వనిలాగా
పచ్చని కాంతితో ప్రపంచం కిటికీ లోంచీ స్వఛ్చంగా నవ్వుతుంది
రాత్రి అనుభవాల్ని గుండెలో జ్ఞాపకాలుగా పదిలపరచుకున్నట్టు
గడ్డిపూల మీద మెరిసే నీటిబిందువులు.
http://lalithya.blogspot.com/2007/09/blog-post.html
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
ఆకాశపు హృదయం నుండి సౌహార్ధ్రం జాలారినట్లు వాన ఎంత చక్కని భావన,
స్వప్నం స్పురించటం, దృశ్యం అదృశ్యంలోకి మాయమవటం,
పచ్చని కాంతితొ ప్రపంచం, అన్నీ కొత్త ప్రయోగాలే. ఎపుడైనా గమనించారా వర్షంలో త
డిసిన చెట్లు ఎలా పచ్చగా మెరుస్తాయో. ఈ కవి చూసాడు, కవిత్వీకరించాడు.
ఇంత మంచి కవితని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. నాకవితకు కూడా ఈ కవిత పక్కన స్థానం ఇచ్చినందుకు గర్విస్తున్నాను.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Post a Comment